జూలూరుపాడు, మే 03 : అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. శనివారం ఆయన స్పందిస్తూ.. భారీ వర్షానికి పలు గ్రామాల్లో వరి ధాన్యం, మక్కలు, మామిడి తోటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ .20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల దగ్గర ఉన్న ధాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దయిందని రైతులు వాపోతున్నట్లు తెలిపారు. రైతులను పట్టించుకునే నాధుడే లేడని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గాలి వానతో ఇండ్ల పైకప్పులు లేచిపోయి నిరాశ్రయులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతులతో కలిసి మండల కేంద్రాల్లో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.