కొత్తగూడెం అర్బన్, జూన్ 16 : పరిపాలనలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ కావాలనే ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి, ప్రభుత్వ సంస్థలను వినియోగించుకుంటూ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ రెండోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ 18 నెలలుగా రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇంకా అమలు కాలేవని, వాటిని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ మీద ఇలా రాజకీయ కక్షలో భాగంగా నోటీసులు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. పదే పదే కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని నోటీసులు ఇవ్వడం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న చర్య అన్నారు. ఇది రాజకీయంగా వేధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న మార్గమన్నారు. ఫార్ములా – ఈ రేసు వంటి గ్లోబెల్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించి నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత కేటీఆర్‌కు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
Kothagudem Urban : ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వ సంస్థల వినియోగం : వనమా వెంకటేశ్వర్రావు