జూలూరుపాడు, ఏప్రిల్ 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో ఆడ, మగ మొక్కజొన్న కంకులు తిని మృతి చెందిన రైతు జరపలా కృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు రాజేశ్ నాయక్ అన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ధర్మసోత్ దశరధ్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేశ్ నాయక్ మాట్లాడుతూ..
ఏజెన్సీ ప్రాంత అమాయక గిరిజన రైతు జర్పుల కృష్ణ తాను పండించిన “భారతీ-85” రకం ఆడ-మగ మొక్కజొన్నను తిని వెంటనే అస్వస్థకు గురై మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన రైతు మృతి చెంది భార్యా పిల్లలు అనాథలుగా మారినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రైతుకు విత్తనాలు అందజేసిన సీడ్ కంపెనీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదన్నారు. కావున తక్షణమే సంబంధిత సీడ్ కంపెనీపై చర్యలు చేపట్టి, ప్రభుత్వమే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నకలీ విత్తనాల కంపెనీపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏజెంట్లు కొందరు “భారతీ-85” (ఆడమగ-మొక్కజొన్న) రకం విత్తనాలను కృష్ణ చేత బలవంతంగా కొనుగోలు చేయిపించినట్లు కృష్ణ భార్య వాపోయింది. కనీసం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కూడా చేయనివ్వలేదని పేర్కొంది. సదరు భారతీ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమానులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, బాధిత రైతు కుటుంబానికి తక్షణమే రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేసియా ఇప్పించాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి. గుగులోత్ కుశాల్ నాయక్, జిల్లా నాయకులు గుగులోత్ నరేశ్ నాయక్, భూక్య సామ్య నాయక్. అనిల్ నాయక్ పాల్గొన్నారు.