కోల్ సిటీ, జూలై 21 : నారీ లోకానికి ఆషాఢ మాసం అత్యంత ప్రియమైనది. ఈ మాసం చివరి వారం సోమవారం అతివలు గోరింటాకు వేడుకను సామూహికంగా కనుల పండువగా జరుపుకున్నారు. వైవిధ్య భరితమైన డిజైన్లతో చేతులను అలంకరించుకుని మురిసిపోయారు. రామగుండం లయన్స్ క్లబ్ భవన్లో సోమవారం మహిళలు గోరింటాకు వేడుకలను వైభవంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ పీపీ తానిపర్తి విజయలక్ష్మి మాట్లాడుతూ.. రంగుల ఆనందాలు వెదజల్లే ఈ గోరింటాకు ఆరోగ్యాన్ని సైతం పెంపొందిస్తుందన్నారు. గోరింటాకులో వేడిని తగ్గించే గుణంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచి రక్త ప్రసరణ జరిగేలా చేస్తుందన్నారు.
అలాగే శాస్త్రీయంగా గౌరీదేవికి ప్రీతి పాత్రమైన గోరింటాకును ఈ నెలలో ఒక్కసారైనా పెట్టుకోవడం సనాతన ధర్మంలో ఆచారంగా వస్తుందని తెలిపారు. అనంతరం మహిళలు మైదాకు చెట్టుకు భక్తి శ్రద్ధలతో గౌరీపూజ చేసి సహజ సిద్ధమైన గోరింటాలను అంతా కలిసి రోట్లో వేసి మెత్తగా నూరి పాటలు పాడుతూ మహిళలు ఒకరి చేతులకు మరొకరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పీఎస్ కళావతి, మనీషా అగర్వాల్, లయన్స్ పద్మ, సరోజ, నాగరాణి, ఉమ, శ్రీవాణి, షఫాలి, స్వరూప, కంసల్య, జయప్రద, సమత, రంగమ్మ, పార్వతి, అన్నపూర్ణ, ప్రీతి పాల్గొన్నారు.