జూలూరుపాడు, ఏప్రిల్ 11 : భూములు ఇచ్చిన జిల్లా రైతుల నోట్లో మన్ను కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదారిలో గోదావరి జలాలను పారుతున్న సాగర్ కాల్వలోకి మళ్లించడం దుర్మార్గమైన చర్య అని బిజెపి కిషన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి కిసాన్ మోర్చా బృందం శుక్రవారం సీతారామ ప్రాజెక్ట్ను పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడిన జిల్లా కావడంతో గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఈ జిల్లాలో ఉన్న అన్ని చెరువులకి ముందుగా నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రాంతంలో ఉన్న వారికి, వ్యవసాయ భూములు కోల్పోయి రైతులకు నీళ్లు ఇవ్వకుండా సాగర్ నీళ్లు వస్తున్న కాల్వకే మళ్లీ గోదావరి నీళ్లు తీసుకుపోయి కలపడం దుర్మార్గ మైన చర్యగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ మంత్రులు పక్షపాతంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తక్షణమే భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఉన్న చెరువులన్నింటికీ కాల్వలు తీసి నీళ్లు ఇవ్వాలని, అలా చేయకుంటే బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా డబ్బులు ఇవ్వకుండా, పంటల బీమా ప్రవేశ పెట్టకుండా రైతులను మోసం చేసిందన్నారు. పంటలకు బోనస్ ఇవ్వకుండా ఎగ్గొట్టిందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలను ఇచ్చి చేతులెత్తేయడంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఛీ కొడుతున్నట్లు తెలిపారు. రైతాంగ సమస్యలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేశ్, జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇవి రమేశ్, పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేని సతీశ్, బిజెపి జిల్లా నాయకులు నున్న రమేశ్, మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, చంద్రశేఖర్, తెల్లం నరసింహారావు, భూక్య రమేశ్, నిమ్మటూరి రామారావు, రైతులు పాల్గొన్నారు.
Sita Rama Project : భూములిచ్చిన రైతుల నోట్లో మట్టికొట్టి గోదావరి జలాల తరలింపా? : గోలి మధుసూదన్ రెడ్డి