భద్రాచలం, మార్చి 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనార్థం వచ్చిన ఐదుగురు యువకులు భద్రాచలంలో ఉంటున్న వారిద్దరి స్నేహితులతో కలిసి ఏడుగురు విద్యార్థులు గోదావరి నదిలో స్నానానికి దిగగా అందులో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటన భద్రాచలం శివారులోని వేలేరు ప్రాంతంలో చోటుచేసుకుంది. బయటపడ్డ విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి రామయ్యను దర్శించుకోవడానికి ఐదుగురు యువకులు భద్రాచలం వచ్చారు. అనంతరం పట్టణ శివారులోని వేలేరు ప్రాంతంలో ఉన్న గోదావరి నదిలో స్నానాలు చేయడానికి దిగారు. నది ప్రవాహం లోతుగా ఉండటంతో ఒక్కసారిగా ఐదుగురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారి వివరాలు సతీశ్, నవదీప్, తేజజ్ఞ, అభిరామ్, శ్రీకర్ గా గుర్తించారు. వీరితో పాటు ఉన్న మిగతా ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడి సమాచారాన్ని అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే భద్రాచలం పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐలు సతీశ్, శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫైర్ సిబ్బంది కుమార్, హరీశ్, సతీశ్లతో పాటు స్థానిక గజ ఈతగాళ్లు నదిలో యువకుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతానికి గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంతో యువకుల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు.

భద్రాచలంలో విషాదం.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు