– నల్లకుంటలో ధ్వంసమైన కొబ్బరి మొక్కల పరిశీలన
– అధికారులు వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలి
దమ్మపేట, జూలై 06 : దమ్మపేట మండలంలోని నల్లకుంటలో బడుగు, బలహీన, గిరిజన రైతులు బొగ్గం శివ, మల్లా కమల, గోళ్ల సీతారావమ్మ, గోళ్ల వెంకటేశ్వర్లు, గట్ల సర్వేశ్వరరావు, జంగాల వెంకటేశ్వరరావుకు చెందిన 273/1 సర్వే నెంబర్ల భూముల్లో ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు చొరబడి కొబ్బరి మొక్కలను అత్యంత దారుణంగా నరికివేశారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు సోమవారం ఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన కొబ్బరి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులతో మాట్లాడి వారి ఆవేదనను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ వివాదాలు ఏమైనా ఉంటే చట్టపరంగా, కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప, ఇలా చీకటి మాటున అర్ధరాత్రి పూట రైతుల పంటను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. బడుగు, బలహీన, గిరిజన రైతులను బెదిరింపులకు గురిచేయడం, వారిపై అక్రమ కేసులు బనాయించడం ఏమాత్రం సరికాదన్నారు. రైతులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రికార్డుల ప్రకారం అసలైన రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఎవరైనా ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ దారా యుగంధర్, అబ్దుల్ జిన్నా, గాజుబోయిన ఏసుబాబు, పాశం ప్రసాద్, వెలుగోటి మహేష్, సందీప్ తదితర నాయకులు పాల్గొన్నారు.