జూలూరుపాడు, జూన్ 06 : వానాకాలం సాగు సీజన్ ప్రారంభం అవుతున్న వేళ రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ముందు రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు ఈ దేశానికి వెన్నుముక అని ఎన్నో గొప్పలు చెబుతున్న పాలకులు ఆచరణలో వారి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను, అలాగే ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇస్తామన్న మాట నిలుపుకోలేకపోయిందన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు నరేశ్, తాటి నరసింహారావు, భూక్య బాలు, నాగేశ్వరావు, బాలకోటి, భావసింగ్, భోజ్య, దశరథ్, పారుపల్లి కృష్ణారావు, ఎట్టి కృష్ణార్జునరావ్, బి.నరేశ్, బానోతు, వీరు, జి.బాలాజీ, వి.కోటియా, ఎన్. మేఘ్య, ఆర్.తిరుమల్ రావు, బి.శీను పాల్గొన్నారు.