ఇల్లెందు, ఆగస్టు 28 : రైతులకు యూరియా ఇవ్వాలని ఇల్లెందు మార్కెట్ యార్డ్‌లో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు భారీగా వచ్చిన రైతులు యూరియా ఇవ్వకపోవడంతో ఇల్లెందు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి ఆందోళన చేశారు. గురువారం తెల్లవారుజామున ఇల్లెందు పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు వచ్చిన రైతులకు యూరియా ఇవ్వకుండా అధికారులు ఆలస్యం చేయడంతో రైతులు ఇల్లెందు ప్రభుత్వ హాస్పిటల్ ముందున్న మెయిన్ రోడ్డుపై నిలబడి నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
ఒక తరుణంలో సీఐ తాటిపాముల సురేశ్, ఎస్ఐ హసీనా రైతులకు నచ్చజెప్పినా తమకు యూరియా కావాలని రైతులు రోడ్డుపై బీస్మించి కూర్చున్నారు. వెంటనే అక్కడికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులకు నచ్చజెప్పి సొసైటీ గోడౌన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రైతులు తమకు యూరియా అందించాలని, ఇప్పుడు పంటలకి యూరియా వేయకపోతే ఇబ్బంది, తీవ్ర నష్టం వస్తుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇల్లెందు ప్రాంతానికి తగిన యూరియా వచ్చిందని అధికారుల అసమర్ధత వల్ల పూర్తిస్థాయిలో రైతుల వద్దకు చేరలేదని పేర్కొంటూ అధికారులను మందలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ లాల్‌చంద్, ఏఓ సతీశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, సొసైటీ చైర్మన్ ఎం.కృష్ణ పాల్గొన్నారు.