బూర్గంపహాడ్, సెప్టెంబరు 05 : రైతులకు ఆధునిక వ్యవసాయంపై సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎంఏ) ఆధ్వర్యంలో ఆర్పీఎల్ శిక్షణా కార్యక్రమాలను బూర్గంపహాడ్, తాళ్లగొమ్మూరు రైతు వేదికల్లో శనివారం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో మణుగూరు ఏడీఏ తాతారావు మాట్లాడుతూ… సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే పద్ధతులు, పంటలను ఆశించే చీడపీడల నివారణ, సేంద్రీయ ఎరువుల వినియోగం, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలుచేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించి వ్యవసాయానికి సంబంధించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శంకర్, ఏఈవోలు నాగవైష్ణవి, శృతి, పవన్, కొత్తగూడెం కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భరత్, ఆత్మకమిటీ సభ్యులు యారం లక్ష్మిరెడ్డి, బాసిబోయిన నర్సింహారావు, బోడా దివ్య, ప్రజా ప్రతినిధులు, మండలంలోని రైతులు పాల్గొన్నారు.