రుద్రంపూర్, మే 18 : వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రామవరం జామియా మసీదు కమిటీ సభ్యులు మానవత్వాన్ని చాటుతూ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఉచిత చల్లని మంచినీటి సేవలను అందిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కోసం వచ్చే ప్రజలు, రోగులు, వారి బంధువుల కోసం కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చల్లని ప్యూరిఫైయర్ వాటర్ క్యాన్లను ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా రోజుకు సుమారు 40 క్యాన్ల చల్లని నీటిని అందుబాటులో ఉంచుతూ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే నీటి సరఫరా పర్యవేక్షణ కోసం ఒక సహాయకుడిని కూడా నియమించారు.
ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలను అందిస్తున్నారు. మండుతున్న ఎండల్లో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఉచితంగా చల్లని నీరు అందడంతో పలువురు కమిటీ సభ్యుల సేవా భావాన్ని అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎండాకాలం పూర్తయ్యేంతవరకు ఈ ఉచిత సేవ కొనసాగిస్తాం. మానవ సేవే మాధవ సేవ అనే భావంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఖురాన్లో చెప్పినట్లు భూమిపై ఉన్న వారిపై మీరు కరుణ చూపండి నేను మీపైన కరుణ చూపెడతాను సందేశాన్ని నమ్మి ఆచరణలో చూపించడమే తమ ఉద్దేశం అని తెలిపారు.