రుద్రంపూర్, జూలై 04 : కొత్తగూడెం ఏరియాలోని పీవీకే నెం.5 ఇంక్లైన్ భూగర్భ గనిని సింగరేణి భూగర్భ గనుల జనరల్ మేనేజర్ కె. యాదయ్య శనివారం సందర్శించారు. గనిలో జరుగుతున్న ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రతా ప్రమాణాలు, నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధనపై సమగ్ర తనిఖీ నిర్వహించారు. తనిఖీ సందర్భంగా గనిలోని వివిధ పని స్థలాలను పరిశీలించిన జీఎం, భద్రతా నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను నాణ్యతతో, సమయ పాలనతో పూర్తి చేయడంతో పాటు ఉత్పాదకతను మరింత పెంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం ప్రతి అధికారి బాధ్యత అని స్పష్టం చేశారు.
అనంతరం గని నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, యంత్రాల పనితీరు, ఉత్పత్తి పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పనుల్లో నాణ్యత, సామర్థ్యం పెంపునకు అవసరమైన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ. టు జీఎం ఎం.గోవిందరావు, ఏరియా ఇంజినీర్ వి.రామకృష్ణ, పీవీకే నెం.5 ఇంక్లైన్ ఏజెంట్ రామ్ భరోస్ మెహతో, గ్రూప్ ఇంజినీర్ గోదావరి శ్రీనివాసరావు, మేనేజర్ పి.రవికిరణ్, సేఫ్టీ ఆఫీసర్ అనిల్ సాగర్, పిట్ ఇంజినీర్ శ్రీనివాస్, ఇంజినీర్ (ఈ&ఎం) బి.శివరామ్ తదితర అధికారులు పాల్గొన్నారు.