పెనగడప, జూలై 13 : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం (National Deworming Day–NDD) సందర్భంగా సోమవారం పెనగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి నివారణకు ఆల్బెండజోల్ మాత్రల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, అర్హులైన విద్యార్థులచే ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా పెనగడప పీహెచ్సీ పరిధిలో మొత్తం 6,979 మంది విద్యార్థులను లక్ష్యంగా నిర్ధారించగా.. 6,752 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఏదైనా కారణాల వల్ల ఈ రోజు మాత్రలు మింగని విద్యార్థులకు జూలై 20న నిర్వహించే “మాప్-అప్ డే” (Mop-Up Day) సందర్భంగా సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయుల సమన్వయంతో ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా మింగేలా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ బి.హరీష్, ప్రశాంతినగర్ వైస్ సర్పంచ్ ఈ.స్వప్న, ఎంఎల్హెచ్పీ సువర్ణ, హెల్త్ విజిటర్ భద్రమ్మ, ఏఎన్ఎం మంజుల, ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.