దుమ్ముగూడెం, సెప్టెంబర్ 08 : భక్తులు కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా పేరుగాంచిన దుమ్ముగూడెం గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు దుమ్ముగూడెం మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించి, తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేకంగా సారె పంపిణీ చేశారు. చీర, జాకెట్, కుంకుమతో కూడిన సారెను భక్తులకు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం భక్తులు సారెను స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు దర్శనం, పూజలు, అన్నదానం తదితర కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బైరెడ్డి సతీష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ముత్యాలమ్మ దేవాలయానికి పోటెత్తిన భక్తులు