– కిడ్నీ, లివర్ సమస్యతో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స
బూర్గంపహాడ్, ఆగస్టు 27 : ఆపన్న హస్తం కోసం ఓ అభాగ్యుడి కుటుంబం ఎదురుచూపులు చూస్తోంది. బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డకు చెందిన కణితి రామకృష్ణ అనారోగ్యం పాలై కిడ్నీ, లివర్ సమస్యతో ఖమ్మం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. రామకృష్ణ అంజనాపురం గ్రామ పంచాయతీలో ఈజీఎస్ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత పది రోజులుగా రామకృష్ణ అనారోగ్యానికి గురికావడంతో కడుపునొప్పి తీవ్రంగా ఉండటంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఇక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి కిడ్నీ, లివర్ సమస్య ఉందని, 24 గంటల కడుపునొప్పి ఆపరేషన్ కూడా చేయాల్సి ఉందని చెప్పడంతో తక్షణమే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి హుటాహుటీన తీసుకువెళ్లి వైద్యం చేయిస్తున్నారు.
అయితే అక్కడి వైద్యులు ఆపరేషన్‌కు సుమారు రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో అసలే ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా తేవాలని భార్య, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తన భర్తకు అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తుందని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని వాట్సాప్ గ్రూపులను సంప్రదించింది. ఇదిలా ఉండగా రామకృష్ణ తల్లి కణితి లక్ష్మి అనారోగ్యంతో మృతిచెందగా తన సోదరుడు చర్లలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ డెంగ్యూ జ్వరంతో హైదరాబాద్‌లో గత ఏడాది మృతిచెందాడు. రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో దాతల కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. సహాయం చేయాలనుకునే దాతలు 6300229803 నెంబర్‌కు ఫోన్‌పే/ గూగుల్ పే చేయాలని వేడుకుంటున్నారు.