దమ్మపేట రూరల్, జులై 18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తాసీల్దార్ రామ్ నరేష్, పెద్దగొల్లగూడెం జీపీఓ అనంతమ్మను సస్పెండ్ చేస్తూ శనివారం కలెక్టర్ అంకిత్ ఆదేశాలు జరీ చేశారు. పెద్దగొల్లగూడెం రెవెన్యూలో బతికున్న వ్యక్తి మళ్లా సత్యం మృతి చెందాడని, సత్యంకు నలుగురు సంతానం ఉండగా ఒకే కుమార్తె నామా పుష్పావతి అని ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికేట్ ఇచ్చి 5 ఎకరాల అస్సైన్డ్ భూమికి అక్రమంగా రికార్డులు మార్చారు. ఈ ఘటనలో పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. దీంతో పాటు ముష్టిబండ రెవెన్యూలో కులాంతరంగా పసుపులేటి మోహన గంగా భవాని నుండి నల్లగుల్ల స్వరూప రాణికి పార్టిషన్ డీడ్ ద్వారా రికార్డులు మార్పు చేశారు. ఈ విషయాలపై కలెక్టర్ కొత్తగూడెం ఆర్డీఓ మధును విచారణ అధికారిగా నియమించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డీఓ సమర్పించిన నివేదిక ఆధారంగా రామ్ నరేష్, అనంతమ్మ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.