– 8 నెలల్లో 13 కేసులు నమోదు
– రూ.34 లక్షలు స్వాహా
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 08 : సామాన్యుల కష్టార్జితం సైబర్ కేటుగాళ్ల పాలవుతోంది. బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, విస్తృత ప్రచారం చేస్తున్నా అవగాహన లేమితో కొందరు మాత్రం సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుండి అంటే 8 నెలల కాలంలో 13 సైబర్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు సుమారు రూ.34 లక్షల వరకు నష్ట పోయినట్లు పోలీసులు వెల్లడించారు. గత జూలై నెలలో బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గౌతాపురం కాలనీలో ఓ మహిళ ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్ ద్వారా పంపుతూ డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తామని బెదిరించి బాధితురాలి ఖాతా నుండి విడతల వారీగా నిందితులు వారు సూచించిన ఖాతాకు రూ.6.70 లక్షలు బదిలీ చేయించుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఆమె ఖాతాను హోల్డ్ చేయించి రూ.3.20 లక్షలు సైబర్ కేటుగాళ్లకు వెళ్లకుండా ఆపగలిగారు. ఇప్పటికైనా సైబర్ నేరాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు.
సెల్ఫోన్లకు వచ్చే ఆకర్షణీయ సందేశాలు, గుర్తు తెలియని లింక్‌లు క్లిక్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో క్షణాల్లో డబ్బు మాయమవుతోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు యువత గేమింగ్, బెట్టింగ్ యాప్‌లను ఆశ్రయించి భారీగా డబ్బును పోగొట్టుకుంటున్నారు. అత్యవసర అవసరాల కోసం అనుమతి లేని లోన్ యాప్‌లను డౌన్లోడ్ చేస్తూ వేధింపులు, ఆర్థిక మోసాలకు గురవుతున్నారు. మరోవైపు బ్యాంకు అధికారులమంటూ, లక్కీడ్రా వచ్చిందంటూ ఫోన్ చేసి మాయమాటలతో ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం కేటుగాళ్లు సేకరిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో, ఫోన్‌కాల్స్, మెసేజ్ లు, లింకుల విషయంలో ప్రజలు అప్రమత్తత పాటించాలని బూర్గంపహాడ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అత్యాశే సైబర్ నేరగాళ్లకు ప్రధాన ఆయుధంగా మారుతుందని, అనుమానాస్పద కాల్స్, లావాదేవీలు ఎదురైతే తక్షణమే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకుని జాగ్రత్తలు పాటిస్తే సైబర్ మోసాల నుండి బయటపడే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

బూర్గంపహాడ్‌లో పెచ్చుమీరుతున్న సైబర్ మోసాలు
సైబర్ మోసాల పట్ల మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ఫోన్లకు వచ్చే లింకులు, ఆకర్షణీయ మెసేజ్‌లు క్లిక్ చేయడం గానీ ఓపెన్ చేయడం కానీ చేయవద్దు. యువత గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలి. వేధింపులు, ఆర్థిక మోసాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలి. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో, ఫోన్‌కాల్స్ ఎత్తవద్దు. బ్యాంకు ఖాతాల్లో సైబర్ మోసంతో డబ్బులు మాయమైతే పోలీసులను తక్షణమే సంప్రదిస్తే డబ్బు ఖాతా నుండి పోకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ప్రజలు సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.