చండ్రుగొండ, మే 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న హరితహారం చెట్లను నరికివేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో చెట్లు నరికివేశారు. చండ్రుగొండ గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన విద్యుత్ లైన్ కింద ఉన్న హరితహారం చెట్లను పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ లోపంతో ఇటీవల నరికి వేశారు. ఐదారేండ్ల పాటు ప్రభుత్వ ఖర్చుతో పెంచిన హరితహారం మొక్కలు నేడు చెట్లుగా మారిన సమయంలో ముందస్తు అవగాహన లేక నరికించి వేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా జాతీయ రహదారి వెంబడి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటిని పెంచారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటితే, విద్యుత్‌కు అంతరాయం పేరుతో విద్యుత్ శాఖ అధికారులు చెట్లను నరికేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హరితహారం చెట్లు నరికివేయకుండా చూడాలని కోరుతున్నారు.
Chandrugonda : చండ్రుగొండలో హరితహారం చెట్లు నరికివేత