బూర్గంపాడు, ఫిబ్రవరి 7: మండల పరిధిలో సారపాక భాస్కర్ నగర్‌కు చెందిన భూక్య శ్రీరాములు అనే వ్యక్తి బతికుండగానే చనిపోయినట్లుగా దొంగ డెత్ సర్టిఫికెట్(Fake death certificate) సృష్టించి 10 లక్షల రూపాయల ఎల్ఐసీ బీమా సొమ్మును(LIC insurance money) కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భాస్కర్ నగర్ కు చెందిన శ్రీరాములు బతికుండగానే చనిపోయినట్లుగా కుక్కునూరు నుంచి డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. శ్రీరాముడు చనిపోయినట్లుగా ఆరు నెలల క్రితం ఎల్ఐసి ఆఫీసులో డెత్ సర్టిఫికెట్ అందజేసి రూ.10 లక్షల బీమా సొమ్మును రెండు నెలల క్రితం తీసుకున్నారు.
ఇందులో ఐదున్నర లక్షలు ఎల్ఐసి ఏజెంట్, రూ.3.50 లక్షలు భూక్య శ్రీ రాముల కుటుంబం, మరో లక్ష రూపాయలు ఇంకో వ్యక్తి తీసుకున్నారు. ఆలస్యంగా వ్యవహారం వెలుగులోకి రావడంతో ఎల్ఐసి అధికారులు గురువారం విచారణ చేపట్టారు. బీమా సొమ్మును కాజేసిన వారి నుంచి రికవరీ చేశారు. ఈ వ్యవహారపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్లు చేస్తున్నట్లు ఎల్ఐసి అధికారులు తెలిపారు.