– నిరాధార ఆరోపణలపై ఎన్కే నగర్ బాదావత్ తండా సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్
చుంచుపల్లి, ఆగస్టు 28 : చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ బాదావత్ తండా గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతుండటాన్ని జీర్ణించుకోలేకనే కొందరు తనపై దొంగ బిల్లులు, దొంగ పంపు కనెక్షన్లంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్ తీవ్రంగా మండిపడ్డారు. పంచాయతీ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ బాధ్యతలు చేపట్టిన 8 నెలల్లో గ్రామస్థులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. తాను చేపట్టిన ప్రతి పనికి సంబంధించిన ఫొటోలు, బిల్లులు, ఇతర ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఆరోపణలు చేసే వారు గ్రామస్థుల ముందుకు వస్తే ఒక్కొక్క ఆరోపణకు ఆధారాలతో సమాధానం చెబుతానని ఆయన స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే అధికారులకు వివరణ ఇచ్చామని, సంబంధిత అంశాలను పరిశీలించిన అధికారులు బిల్లులను నిలిపివేయాల్సిన అవసరం లేదని సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ అధికారుల పరిశీలనను కూడా పక్కనపెట్టి పదేపదే కొత్త ఆరోపణలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
గ్రామానికి అవసరమైన కొత్త పంచాయతీ భవనం నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసినప్పటికీ, ఆ స్థలంపై కూడా అభ్యంతరాలు సృష్టిస్తూ పనులు ముందుకు సాగకుండా అడ్డంకులు కల్పిస్తున్నారన్నారు. పంచాయతీలో ఏ అభివృద్ధి పని ప్రారంభించినా దానికి ఏదో ఒక అడ్డంకి సృష్టించడం, ఆ తర్వాత అదే సమస్యను చూపించి సర్పంచ్‌పై నిందలు వేయడం కొందరికి రాజకీయంగా పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు. ఉప సర్పంచ్ తనయుడి రాజకీయ జోక్యంతో పంచాయతీ అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని సర్పంచ్ ఆరోపించారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం గ్రామ అభివృద్ధిని బలిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తనపై దొంగ బిల్లుల ఆరోపణలు చేస్తున్న వారు ముందుగా వాటికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. తాను కూడా ప్రతి బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను, పనులు జరిగిన ప్రదేశాల ఫొటోలను, అందుబాటులో ఉన్న ఆధారాలను గ్రామస్థుల సమక్షంలో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బిల్లులు, వీఓ బిల్డింగ్, బోర్వెల్, ట్యాప్ కనెక్షన్లు, ఎంపీడబ్ల్యూ సిబ్బంది జీతాలు, పంచాయతీ స్థలంలో పార్కు, పోచమ్మగుడి అభివృద్ధి తదితర అంశాలపై పూర్తి వాస్తవాలను ప్రజల ముందుంచుతామని చెప్పారు.
తనపై చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటైనా అవినీతికి సంబంధించినదిగా నిరూపిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నానని శ్రీకాంత్ సవాల్ చేశారు. అదే సమయంలో నిరాధార ఆరోపణలు చేసి తన ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజల ముందు వాస్తవాలను బయటపెడతామని హెచ్చరించారు. “ప్రజలు నాపై నమ్మకంతో సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. రాజకీయ అడ్డంకులు ఎన్ని వచ్చినా అభివృద్ధిని ఆపను. పంచాయతీ అభివృద్ధి కోసం అవసరమైతే ప్రతి అంశాన్ని ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకెళ్తా” అని స్పష్టం చేశారు. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని, రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.