బూర్గంపహాడ్, ఆగస్టు 31 : బూర్గంపహాడ్ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం ఎంపీడీవోకు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు అర్హత కలిగిన నిరుపేదలకు వచ్చేలా అధికారులు చొరవ చూపాలన్నారు. స్థలం లేని వారికి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టేకులచెరువు గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్యను పరిష్కరించాలన్నారు. 40 మందికి నేటికీ ఇళ్లు కేటాయించలేదని, మరమ్మతులు చేసి వారికి వాటిని అప్పగించాలన్నారు.
రేషన్ దుకాణాల్లో 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బూర్గంపహాడ్ గ్రామం గోదావరి వరదలకు మునిగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు గ్రామాల ప్రజలు నష్టపోతారని ఈ సమస్యపై శాశ్వత పరిష్కారం చూపాలని వినతిలో పేర్కొన్నారు. దీనికి స్పందించిన అధికారులు డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాండవుల రామనాథం, ఎస్.అబీదా, రాయల వెంకటేశ్వర్లు, టేకులచెరువు శాఖా కార్యదర్శి బోళ్ల శ్రీశైలం, భారతి, సరిత, తిరుపతమ్మ, రమణ, వెంకయ్య, సూరికంటి అయోధ్య, వినోదం పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ధర్నా