ఇల్లెందు, మార్చి 27 : ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను, రోడ్లను, 350 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయకుండా, తమ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి వెళ్లిన పేదలను, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు, జిల్లా నాయకులను అరెస్టు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా నాయకుడు అబ్దుల్ నబి, ఇల్లెందు మండల కార్యదర్శి ఆలేటీ కిరణ్ తెలిపారు. అరెస్టులను నిరసిస్తూ గురువారం సీపీఎం ఇల్లందు కమిటీ ఆధ్వర్యంలో గోవింద్ సెంటర్ లో మానవహారం నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రామోజీ ఫిలింసిటీ దగ్గర నాగన్‌పల్లి, పోల్కంపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 700 మంది పేదలకు ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున 2007 సంవత్సరంలో ప్రభుత్వం పట్టాలిచ్చింది. కానీ ఆ భూమి మీదకు ప్రజలు వెళ్లి నివాసం ఏర్పాటు చేసుకోకుండా రామోజీ సంస్థ దారిని ఆక్రమించి, చుట్టూ గోడ నిర్మించి సెక్యూరిటీని పెట్టి అడ్డుకుంటున్నది. స్థలాల్లోకి వెళ్లిన 75 మంది పేదలపై గతంలో అక్రమ కేసులు పెట్టి సంవత్సరాల తరబడి కోర్టులు చుట్టూ తిప్పింది.
జిల్లా కలెక్టర్, పోలీస్ యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని దీనిని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ, రామోజీ సంస్థకే అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు దుయ్యట్టారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 400 మంది లబ్దిదారులను వారికి ఇచ్చిన స్థలాల వద్దకు తీసుకెళ్లడంతో పోలీసులు నాయకులు, పేదలపై కర్కశంగా ప్రవర్తించి అరెస్టులు చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించిన రామోజీ సంస్థపై కేసులు నమోదు చేయాలని, పేద ప్రజలకు తమ ఇంటి స్థలాలను అప్పగించి, నివాసం ఉండే విధంగా ఇండ్లు నిర్మించుకోవడానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సీపీఎం నాయకులు తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, వజ్జ సురేశ్, రాజమౌళి, వీరభద్రం, సంతోష, సుజాత, కమల, నీలారాణి, హుస్సేన్, రాజు, రసూల్ బీ, వెంకన్న, భవాని పాల్గొన్నారు.