ఇల్లెందు, జూలై 18 : దేశంలో మతోన్మాద బీజేపీకి, రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి, భద్రాద్రి కొత్తగూడేనికి నీళ్లు రాకుండా చేసిన అధికార పార్టీ మంత్రులపై సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ కేంద్ర కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఠాగూర్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవనంలో వారు మాట్లాడుతూ.. నేడు దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మైనార్టీలను శత్రువులుగా ఎంచుకుని వేటాడి చంపుతున్నట్లు తెలిపారు. పౌర, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ, దాడులకు తెగపడుతూ, భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారన్నారు. దేశంలో ఒక్క శాతం ఉన్న కార్పొరేట్ శక్తులకు దేశ సంపద, సహజ వనరులను తాకట్టు పెడుతూ ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి జైల్లో కుక్కుతున్నారన్నారు.
మణిపూర్ మత అల్లర్లు, బస్తర్ చత్తీస్‌గఢ్ ఏరియాలో అమాయక ఆదివాసులను చంపుతూ రక్తపుటేరులు పారిస్తున్నారన్నారు. మధ్య భారతంలో భారత రాజ్యాంగం అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీలను గాలికి వదిలేసిందన్నారు. భద్రాద్రి నీళ్లను భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు చండ్ర అరుణ, రమక్క, కేజీ రామచందర్, చిన్న చంద్రన్న, చంద్రశేఖర్ జీవిత సహచరి విమల, కెచ్చల రంగారెడ్డి, ముద్ద భిక్షం, నాయిని రాజు, జగ్గన్న, అమర్లపూడి రాము, అజ్మీర బిచ్చ, కొత్తపల్లి రవి, జాటోత్ కృష్ణబుర్ర వెంకన్న, యాకూబ్ శావళి, రేస్ బోసు, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్ పాల్గొన్నారు.