జూలూరుపాడు, జూన్ 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలపై తక్షణమే విచారణ జరిపి, నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో జూలూరుపాడు తాసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల అర్హులైన నిరుపేదలకు పథకాన్ని దూరం చేసి, అన్హర్హులకు పెద్దపీట వేసి వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. అనేక గ్రామాల్లో ఇల్లు ఉన్నవారికే మరలా ఇల్లు మంజూరు చేశారని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ నిజమైన నిరుపేదలకు అన్యాయం చేశారని విమర్శించారు.
ప్రజా పాలనలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి నేటికీ రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతూ సకాలంలో రాక తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కోరారు. వృద్ధాప్య వితంతు, వికలాంగుల పెన్షన్లు, రాక ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని దరఖాస్తుదారులకు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసీల్దార్ శ్రీనివాస్‌కు అందజేశారు,
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, నాయకులు గుండెపిన్ని మధుసూదన్ రావు, యాస రోశయ్య, ఎస్కే. చాంద్ పాషా, గుడిమెట్ల సీతయ్య, చెరుకుమల రామకృష్ణ, రాజేశ్వరరావు, కంచర్ల రాఘవేంద్రరావు, కల్తీ కృష్ణయ్య, అనుమల అశోక్, కొండ వీరయ్య, కొమ్ము రాంబాబు, ఎస్కే. బుడేన్, గార్లపాటి శివకృష్ణ, బరగడ రమేశ్, పసుపులేటి పవన్, కిరణ్, సాయి, బబ్లు, సందీప్, పద్మాకర్ పాల్గొన్నారు.