రామవరం, మే 07 : అక్కడ ఫంక్షన్ చేసుకోవాలంటే వచ్చే బంధువులను చూసుకోవాలో, లేక గోడ్లను కాపలా కాయాలో అర్థం కాని పరిస్థితి. ఏదైనా శుభకార్యం చేసుకునే కార్మిక కుటుంబాలకు పశువులతో వేదనలు అంత ఇంత కాదు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో సింగరేణి ఉద్యోగుల ఇళ్లల్లో ఏదైనా శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల కోసం సింగరేణి యాజమాన్యం రామవరం, గౌతమ్‌పూర్ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్, రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ఏర్పాట్లు చేసింది.
అయితే వీటి ప్రధాన ద్వారం వద్ద పశువులు రాకుండా క్యాటిల్ గార్డ్ ఏర్పాట్లు లేకపోవడంతో, విందు సమయంలో తిన్న విస్తరాకుల కోసం పశువులు ఎగబడుతున్నాయి. వాటిలో అవి కుమ్ములాడుకోవడం పరిపాటిగా మారింది. గతంలో పశువుల దాడిలో గాయపడిన వారు ఉన్నారు. పశువులు నేరుగా భోజనశాలలకు ప్రవేశించి. భోజనం, ఇతర పదార్థాల్లో మూతులు పెట్టడంతో అవి పనికి రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పశువులు, ఇతర జంతువులు రాకుండా ఉండేటట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.