భద్రాద్రి కొత్తగూడెం: దళితుల అభివృద్దిలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో దళితబంధు పథకం అమలుపై అన్ని శాఖల అధికారుతో సమీక్షించారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 100 మంది దళితులను ఈ పథకానికి ఎంపిక చేయడం జరుగుతుందని, దళితబంధు ద్వారా ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నట్లు చెప్పారు.
ఈ సదవకాశాన్ని దళితులు సద్వినియోగం చేసుకొని స్వీయ అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఆర్థికాభివృద్దికి అవకాశం ఉండే రంగాలను దళితులు ఎంచుకునే విధంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో దళితులు వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకొని అభివృద్ధి చెందేందుకు అన్ని శాఖల అధికారులు వారివారి శాఖలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ నివేదికలు రూపొందించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం, డీఆర్డీవో మధుసూధన్రాజు, డీపీవో రమాకాంత్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.