రుద్రంపూర్, ఆగస్టు 22 : పార్థీనియం (కాంగ్రెస్ గడ్డి) వల్ల కలిగే హానికర ప్రభావాలపై ప్రజలు, రైతులు అవగాహన పెంచుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) భద్రాద్రి కొత్తగూడెం సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ డా.టి.భరత్ అన్నారు. శనివారం కేవీకేలో నిర్వహించిన పార్థీనియం అవగాహన వారోత్సవం కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.టి.భరత్ మాట్లాడుతూ.. పార్థీనియం హిస్టెరోఫోరస్ మొక్క వల్ల మానవులు, పశువులు, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వివరించారు. పార్థీనియం పుప్పొడి, మొక్క భాగాలతో సంబంధం ఏర్పడితే మనుషుల్లో హే ఫీవర్, బ్రాంకైటిస్, ఆస్తమా, చర్మ అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.
పార్థీనియం కలిసిన మేతను పశువులు తీసుకోవడం లేదా నిరంతరం ఆ మొక్కకు గురికావడం వల్ల వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ముఖ్యంగా గేదెల్లో పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్నారు. పార్థీనియంను ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా దాని వ్యాప్తిని నియంత్రించవచ్చని సూచించారు. వ్యవసాయ క్షేత్రాలు, పరిసర ప్రాంతాల్లో పార్థీనియం నిర్మూలనకు రైతులు, సిబ్బంది సమిష్టిగా చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.