చండ్రుగొండ, మే 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ఆదిలోనే అవినీతి కారణంగా అభాసుపాలు అవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని తొలిసారిగా బెండలుపాడు గ్రామంలో గిరిజన పోడు రైతుల కోసం ఒక్కో రైతుకు సౌర గిరి వికాస్ పథకం రూ.6 లక్షల అంచనా వ్యయంతో రెండు బోర్లు అనగా ఇద్దరు రైతులకు రూ.12 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేశారు. అయితే ఈ రెండు బోరు బావుల్లో ఒకటి కూలిపోగా, మరొక దాంట్లో నీళ్లు రావడం లేదు. గిరిజన సౌర వికాస పథకంలో ఆరు లక్షల అంచనా వేయంలో గిరిజన రైతులకు ఒక బోరు, సోలార్ విద్యుత్ ప్లాంట్, సోలార్ పెంచింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
కాగా ఈ 10న (శనివారం) డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రారంభించాల్సి ఉండగా బోర్లు పనికిరాకపోవడంతో తమ పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. అవినీతి కారణంగానే రెండు బోర్లు పనికిరాకుండా పోయాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడి పాత్రతో పాటు, ఐటీడీఏ అధికారుల చేతివాటం తోడు అయిందని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని గిరిజన రైతులు, ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ అశోక్‌ను వివరణ కోరగా ఇందిర సౌర గిరి జల వికాస పథకం ఐటీడీఏ భద్రాచలం అధికారుల పర్యవేక్షణలో జరిగిందని, చండ్రుగొండ మండల పరిషత్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
Chandrugonda : కూలిన ఇందిరా సౌర గిరి జల వికాస బోరు బావులు