రామవరం, ఏప్రిల్ 8 : రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పనివేళలు మార్చాలంటూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. వీరు రోజూ ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు కాలనీల్లో విధులు నిర్వహిస్తూ ఉంటారు. కాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎండలో పనిచేయడం కష్టంగా మారిందని, ప్రతి ఏడాది ఏప్రిల్ నెల నుంచి తమ పని వేళలు మార్చేవారని, ఈ సంవత్సరం ఏప్రిల్ దాటుతున్నప్పటికీ పనివేళలు మార్పు చేయలేదని తెలిపారు. వడదెబ్బ బారిన పడుతూ అనారోగ్యానికి గురైతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
వీరి విజ్ఞప్తులపై జనరల్ మేనేజర్ సివిల్ టి.సూర్యానారాయణ సానుకూలంగా స్పందించారు. సింగరేణి వ్యాప్తంగా హౌస్ కీపింగ్, పారిశుధ్య కార్మికులు సుమారు 3 వేల మంది ఉంటారని, ఇప్పటికే మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, ఇల్లందు ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి నుండి వచ్చిన అభ్యర్థన మేరకు రేపటి (బుధవారం) నుండి ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే విధుల నిర్వహణ ఉంటుందని తెలిపారు.