రామవరం, జూలై 23 : కూతురిని కొట్టిన తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారాపాక గ్రామంలో బాలిక (8)ను తండ్రి మిర్యాల రమేశ్ కొడుతున్నట్లు టోల్ ఫ్రీ నంబర్ 1098 కు ఫిర్యాదు అందింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కోఆర్డినేటర్ బానోత్ సందీప్, కేస్ వర్కర్ జి.భవాని, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రోటెక్షన్ యునిట్ పీఓ ఎన్.ఐ.సి. అదూరి శేషయ్య, ఔట్రిచ్ వర్కర్ ఎస్.లతా, ఐసిడిఎస్ సుపర్ వైజర్ సక్కుబాయి సారాపాకలోని బాలిక ఇంటికి వెళ్లారు. విచారించగా బాలిక తన తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి కురివి వెళ్లినట్టు తెలిసింది.
దీంతో బాలికతో వీడియో కాల్ లో మాట్లాడిన సాదిక్ పాషా జరిగిన విషయం తెలుసుకుని, బాలిక తండ్రిపై పోలీస్ కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చారు. సుపర్ వైజర్ సక్కుబాయి ఫిర్యాదు మేరకు బుర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్ కేసు నమోదు చేశారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలను ఎవరైనా కొట్టినా, చైల్డ్ మ్యారేజీ చేసినా, చైల్డ్ లేబర్‌గా పని చేయిస్తున్నా టోల్ ఫ్రీ నంబర్ 1098 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కాలర్ వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని పేర్కొన్నారు.