కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 28 : భవిష్యత్లో వచ్చే ఏ ఎన్నికలైనా గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని, కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈ సభతో తేటతెల్లమైందని, సభకు వచ్చిన లక్షలాది ప్రజలే దీనికి నిదర్శనమని తెలిపారు. సోమవారం ఆయన స్పందిస్తూ.. సభకు లక్షలాది జనం స్వచ్ఛంధంగా తరలివచ్చారని, ఇంకా అనేక మంది ట్రాఫిక్ జాం వల్ల సభకు చేరుకోలేకపోయారన్నారు.
కాంగ్రెస్ పార్టీ విధానాలతో రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, ఆటోడ్రైవర్లు, మహిళలు, విద్యార్ధులు, యువత ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారు విసిగిపోయారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా బొక్కాబోర్లపడిందన్నారు. సభకు వెళ్లకుండా ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించిందని అయినా అవన్నీ దాటుకుని ప్రజలు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చి బ్రహ్మరథం పట్టారన్నారు. సభకు లక్షలాది ప్రజలే ప్రభుత్వంపై వ్యతిరేకతకు సాక్ష్యమన్నారు.
మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని, తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని ప్రజలు నమ్ముతున్నట్లు వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై ప్రజలను పీడిస్తున్నాయని, ఆ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ కార్యకర్తలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో పార్టీని రానున్న రోజుల్లో బలోపేతం చేస్తామని, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేనిశక్తి మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు ఈ సంధర్భంగా వనమా కృతజ్ఞతలు తెలిపారు.