భద్రాద్రి కొత్తగూడెం, మే 3 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం కల్చరల్, మే 3 : ముస్లింల అతి పెద్ద పండుగైన రంజాన్‌ను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈద్ముబారక్లతో ఆత్మీయ ఆలింగనాలు, నమాజ్‌లు, మహ్మద్ ప్రవక్త సందేశాలు, ఖురాన్ పఠనాలు, సేమ్యా, ఖీర్ల ఆస్వాదనలు జరిగాయి. మొత్తంగా రంజాన్ పర్వం జిల్లా అంతటా వెల్లివిరిసింది. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు మహ్మద్ ప్రవక్త సందేశాలను చాటారు. పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన రోజుగా రంజాన్ పండుగను ప్రార్థనలు, ఖురాన్ పఠనాలతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజులపాటు చేసిన కఠిన ఉపవాస దీక్షలను ముగించి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి వాడవాడల్లో రంజాన్ కళ ఉట్టిపడింది. ముస్లిం సోదరులు సంప్రదాయ నూతన వస్ర్తాలు ధరించి, ఈద్ ముబారక్ అంటూ పరస్పరం ఆలింగనాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఖమ్మంలో గొల్లగూడెం ఈద్గా వద్ద పెద్ద ఎత్తున్న ముస్లింలు నమాజ్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముస్లింలతో కలిసి ప్రత్యేక నమాజులో పాల్గొన్నారు.
ముస్లింల ఆహ్వానం మేరకు ఆయన వారి గృహాలకు వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు అందించిన విందును స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనను అజయ్ఖాన్గా పిలుస్తూ సోదరభావాన్ని చాటే ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు. కేఎంసీ డిప్యూటీ మేయర్ ఫాతిమా ముక్తార్ స్వగృహంలో మంత్రి అజయ్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. గాంధీచౌక్ ఈద్గాతోపాటు ఖిల్లా బజార్ మసీదు, బుర్హాన్‌పురం ఇతర ప్రాంతాల్లోని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక నమాజ్‌లు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు అన్యమతస్తులను తమ ఇళ్లకు ఆహ్వానించి విందు భోజనాలతో మత సామరస్యాన్ని చాటారు.
కొత్తగూడెం జిల్లాలో..
భద్రాద్రి జిల్లాలోనూ రంజాన్ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. కొత్తగూడెం, పాల్వంచ, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు ప్రత్యేక నమాజుల్లో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బోడగుట్ట ఈద్గా వద్ద నమాజ్‌లో పాల్గొన్నారు. అక్కడ ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఉర్దూఘర్ చైర్మన్ అన్వర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.