భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 17 : మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నందున ముందుగానే మున్సిపల్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐడిఓసి లో వార్డుల వారిగా రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కు కేటాయించగా, అశ్వరావుపేట మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళ, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళకు కేటాయిస్తూ అధికారికంగా ప్రకటించారు.
కొత్తగూడెంలో కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగూడెంలో పాల్వంచ, సుజాతనగర్ను కలపడంతో మొత్తం 60 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు నరసరావుపేట కూడా కొత్తగా మున్సిపాలిటీ అవడంతో అక్కడ కూడా 20 వార్డుల రిజర్వేషన్ ను లాటరీ ద్వారా తీశారు. గతంలో ఉన్న ఇల్లెందు మున్సిపాలిటీ 24 వార్డులు ఉండగా అక్కడ కూడా లాటరీ పద్ధతి ద్వారా రిజర్వేషన్ కేటాయించారు. ఇప్పటికే ఎదురుచూస్తున్న ఆశావాహులు ఏ వార్డుల్లో ఎవరు పోటీ చేసే అవకాశం ఉందో అనేది రిజర్వేషన్ జాబితాను చూసుకుని పోటీకి సిద్ధపడుతున్నారు.

Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు