కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 20 : ఈ నెల 21 నుండి ఐదు రోజుల పాటు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్‌లో జరగనున్న సిపిఐ జాతీయ మహాసభలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తొమ్మిది మందికి అవకాశం లభించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వర్ రావు, నరాటి ప్రసాద్, సారెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, ఎస్ డి.సలీం, సలిగంటి శ్రీనివాస్, దేవరకొండ శంకర్ శనివారం చండీగఢ్‌కు బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర పార్టీ కోటానుంచి కొత్తగూడెంకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రతినిధిగా పాల్గొననున్నారు.
ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బొగ్గు గని ప్రాంతాల్లో ప్రతిపాదనలో ఉన్న నూతన బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 1/70 చట్టం అమలు, కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, గ్రామీణ ప్రాతంలో గిరిజన, గిరిజనేత పేదల భూ సమస్యలు, విమానాశ్రయం, జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు వంటి వాటిపై జిల్లా తరుపున తీర్మానం ప్రవేశ పెడతామని తెలిపారు.