చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని బామ్ సెఫ్ నేషనల్ క్యాడర్, తెలంగాణ ఇంచార్జ్ నల్ల శ్రీధర్ అన్నారు. ఆదివారం రామవరం లోని ఎస్సిబి నగర్ మోడర్న్ ఇక్రా స్కూల్లో జరిగిన బామ్ సెఫ్ క్యాడర్ క్యాంపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చరిత్ర లో ఏం జరిగింది, జరుగుతుంది, జరగబోతుందనే విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చరిత్ర, సమాజంపై మిడిమిడి జ్ఞానం చాలా నష్ట దాయకమని తెలిపారు. విద్య లేకపోతే, విజ్ఞానం లేకుండాపోతోంది, విజ్ఞానం లేకపోతే నైతికధ లేకుండా పోతుంది, నైతికత లేకపోతే ఐక్యత లేకుండా పోతుందన్నారు.
భారతదేశ సామాజిక ఉద్యమకారులైన వారిని నిత్యం మననం చేసుకోవాలన్నారు. బిర్సా ముండ ఆధ్వర్యంలో 17వ శతాబ్దంలోనే మా భూమి మాదేనంటూ, స్వాతంత్ర ఉద్యమం నడిపి విముక్తి కోసం పోరాటం చేసిన ఘనత మనకి ఉందన్నారు. కేరళలో నారాయణ గురు ప్రజలందరినీ గుడులకు అనుమతించాలని ఉద్యమించడమే కాకుండా, వందలాది గుడులను నిర్మించి విద్య నేర్పించారని తెలిపారు. 1902లోనే మొదటిసారి 50% రిజర్వేషన్లను అమలు చేసిన సాహు మహారాజ్ ఆదర్శనీయుడని కొనియాడారు. మద్రాస్ లో పెరియార్ ఇ.వి.రామసామి నేతృత్వంలోనే అందరికీ సమానత్వాన్ని అమలు చేశారన్నారు. రాష్ట్ర పిత జ్యోతిబా పూలే ఆధ్వర్యంలో 200 సంవత్సరాల క్రితమే బాలికలకు పాఠశాలలు నిర్మించి విద్యను అందించారని వెల్లడించారు. వీరందరికీ ఆదర్శమైన గౌతమ బుద్ధుడు మానవతా విలువలను, మనిషి జీవన విధానాన్ని, నైతిక విలువలను బోధించడమే కాకుండా, ప్రపంచ మొట్టమొదటి సామాజిక విప్లవకారుడుగా పేరుగాంచి అభివృద్ధికర సమాజానికి బాటలు వేశారన్నారు.