రామవరం, జూన్ 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, పెనగడప పంచాయతీ పరిధిలోని జగ్గారం, గడ్డి గుట్ట, పాలవాగు గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ భూమికి ట్రెంచ్ కొట్టే పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ మూడు గ్రామాల ప్రజలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన విషయంపై తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జగ్గారం గ్రామంలో ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు గ్రామస్తులకు అటవీ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎఫ్డీఓ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మూడు గ్రామాల వాసులు ఇప్పటికే సుమారుగా 1,200 ఎకరాల వరకు అటవీ భూమిని సాగు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ భూములను కూడా చెట్లు నరికి సాగు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అటవీశాఖ అధికారులు గమనించి ఫారెస్ట్ భూమి చుట్టూ ట్రెంచ్ తీసే కార్యక్రమాన్ని చేస్తుండగా తమ సిబ్బందిపై దాడి చేశారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. అధికారులపై దాడి చేయడం చట్టరీత్యా నేరమన్నారు. మరొకసారి అధికారులపై దాడికి పాల్పడితే ఫారెస్ట్ చట్టం ప్రకారం వారిని అడవి నుండి పంపించేందుకు పూర్తి అధికారం ఉందని తెలిపారు.
చుంచుపల్లి మండల తాసీల్దార్ పి.కృష్ణ మాట్లాడుతూ.. అటవీ సంపదను ఎవరైనా కొల్లగొట్టినా, ఫారెస్ట్ పరిధిలో ఉన్న భూమికి ట్రెంచ్ కొట్టే సమయంలో అధికారులపై దాడులకు పాల్పడినా వారిని బైండోవర్ చేయాలన్నారు. కొత్తగూడెం టూటౌన్ సీఐ ప్రతాప్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు చేయవద్దని, మీకు ఏదైనా సమస్య ఉంటే ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, తాసీల్దార్, ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. మరొకసారి దాడులకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. మరోమారు అధికారులపై దాడులకు పాల్పడితే జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామవరం ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్, సెక్షన్ అధికారులు, టూ టౌన్ ఎస్ఐ, పోలీసు సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.