చుంచుపల్లి, మే 06 : ఫారెస్ట్ అధికారులపై గుత్తికోయలు దాడికి యత్నించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనగడప గ్రామం అటవీ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. రామవరం రేంజ్ ఫారెస్ట్ అధికారులు జగ్గారం గుత్తి కోయల్ హాబిటేషన్లో వన సంరక్షణ, పరిశీలన కార్యక్రమంలో భాగంగా సరిహద్దులను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో గుత్తికోయలు గుంపులు గుంపులుగా ఏర్పడి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి.శైలజ, బీట్ ఆఫీసర్లు, సిబ్బందిపై గుత్తి కోయలు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో గుత్తి కోయలపై ఫిర్యాదు చేయనున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.