కొత్తగూడెం, మార్చి 28 : హర్యానా సమీపంలోని ఖనౌరి, శంబు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల గుడారాలు, వేదికలను పోలీసులు కూల్చివేయడం, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆదేశాలతో పోలీసులు 350 మంది రైతు నాయకులను అరెస్ట్ చేసి జైలులో పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఎస్కేఎం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్ గుమ్మడి నరసయ్య అన్నారు. పంజాబ్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ శుక్రవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు, వారి అనుకూల కేంద్ర ప్రభుత్వం ముందు లొంగిపోవడం హేయనీయమన్నారు. పంజాబ్ ప్రభుత్వం రైతుల జీవితాలను వారి జీవనోపాధిని నాశనం చేసిన కార్పొరేట్ విధానాలకు అనుకూలంగా ఉండి నిరసన హక్కును కాలరాయడంపై ఆయన మండిపడ్డారు.
నరేంద్ర మోడీ – అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల నిరసనను అణచివేయడానికి తీవ్రంగా కృషి చేస్తోందని, ఈచర్యలను యావత్ కార్మిక వర్గం, రైతు వర్గం ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కేఎం రాష్ట్ర నాయకులు అన్నవరపు సత్యనారాయణ. కె.రంగారెడ్డి, రైతు సంఘం కార్మిక వర్గం నాయకుడు ముద్దా భిక్షం, జాటోతు కృష్ణ. అమర్లపూడి రాము, కల్లూరి కిశోర్, కోబల్, గోకినపల్లి ప్రభాకర్, బుర్ర వెంకన్న, మాచర్ల సత్యం, పెదబోయిన సతీశ్, వై.గోపాలరావు, సలీం, సురేశ్, పంతులు, ఎం.రాజశేఖర్, లక్ష్మణ్, నాగేశ్వరరావు. దాసరి సాయి పాల్గొన్నారు.