– ఏడాది ముగుస్తున్న కొనుగోలు చేయని పరికరాలు
చండ్రుగొండ, ఏప్రిల్ 01 : విద్యార్ధులకు సులభతరంగా పరికరాల ద్వారా విద్యాబోధన చేసేలా ప్రవేశపెట్టిన పీఎం శ్రీ నిధులు పక్కదారి పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని అయ్యన్నపాలెం, అశ్వారావుపేటలోని నారావారిగూడెం, చర్ల మండలంలోని కొరుమురు పీఎస్ పాఠశాలలు పీఎం శ్రీ పథకం కింద ఎంపికయ్యాయి. ఏడాదికి రూ.4 లక్షలు స్కూల్ అభివృద్దికి, పాఠాలు చేప్పేందుకు అవసరమైన పనిముట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. ఏడాదిలో రెండు విడతలుగా నిధులు మంజూరు చేస్తారు. అయ్యన్నపాలెం పీఎస్ లో 1 నుండి 5 వరకు 115 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2025 – 26 గాను రెండు విడతలుగా స్కూల్ కు మంజూరైన నిధులతో ఎటువంటి అభివృద్ధి చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. కొనుగోలు చేయకుండా తీర్మానాలు చేయాల్సిందిగా టీచర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్కూల్ కు అవసరమైన రూ.1.40 లక్షల విలువైన పరికరాల కోసం కొత్తగూడెంలోని సిటీ సెలక్షన్ సెంటరులో ఇండెంట్ ఇచ్చినట్లు హెచ్ఎం శ్రీనివాసరావు అంటున్నారు. ఎంఈఓ సూరయ్య ఈ విషయమై వివరణ కోరగా విచారణ జరుపుతామని తెలిపారు.