– డీఎస్పీ గొర్రె మధు దాతృత్వాన్ని కొనియాడిన ఉపాధ్యాయులు
జూలూరుపాడు, సెప్టెంబర్ 01 : తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహకరిస్తూ, విద్యార్థుల కష్టాలను తీర్చేందుకు పూర్వ విద్యార్థులు ముందుకురావడం అభినందనీయమని జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య అన్నారు. జూలూరుపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివి, సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థి, ప్రస్తుత మంచిర్యాల డీఎస్పీ గొర్రె మధు తన తల్లిదండ్రులు దివంగత గొర్రె నరసయ్య – బాలమ్మ జ్ఞాపకార్థం పాఠశాలకు సుమారు రూ.1,20,000 విలువైన సామగ్రిని విరాళంగా మంగళవారం అందజేశారు.

పాఠశాలకు పూర్వ విద్యార్థి రూ.1.20 లక్షల విలువైన సామగ్రి అందజేత
ఇందులో భాగంగా విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్, తరగతి గదుల్లో కూర్చోవడానికి 20 బెంచీలు, అలాగే పాఠశాల కార్యాలయ పనులు, విద్యార్థుల ఆన్లైన్ డేటా ఎంట్రీ, స్కాలర్షిప్లు ఆధార్ అనుసంధాన ప్రక్రియల కోసం ల్యాప్‌టాప్ ప్రింటర్‌ను సమకూర్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఎస్ఎంసీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. ఉన్నత స్థానానికి చేరుకున్నా మూలాలను మర్చిపోకుండా, పేద విద్యార్థుల అవసరాలను గుర్తించి పెద్ద మనసుతో చేయూతనిచ్చిన డీఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠశాలకు పూర్వ విద్యార్థి రూ.1.20 లక్షల విలువైన సామగ్రి అందజేత