జూలూరుపాడు, అక్టోబర్ 13 : జూలూరుపాడు మండల కేంద్రంలో డయాలసిస్ సెంటర్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా ప్రభుత్వాన్ని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మండలంలో కిడ్నీ వ్యాధి బారిన పడి 50 మంది పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళితే బెడ్లు ఖాళీగా లేవని, ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లినా అదే పరిస్థితి నెలకొందని దీంతో డయాలసిస్ బాధితులను వెనక్కి పంపుతున్నట్లు తెలిపారు.
జూలూరుపాడు మండలం నుండి డయాలసిస్ పేషెంట్లు అధికంగా ఉన్నారని, సరైన సమయంలో డయాలసిస్ అందక గత 3 సంవత్సరాల కాలంలో 12 మంది చనిపోయినట్లు వెల్లడించారు. మండల వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా లేని కారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో సేవలు పొందక మంచానికే పరిమితం అవుతున్నారన్నారు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డయాలసిస్ కేంద్రం కోసం స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.