ఇల్లెందు, మార్చి 28: కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బోయతండాలో విషాదం చోటుచేసుకున్నది. ఏడాదిన్నర వయసు కలిగిన ఓ పసికందు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. బోయతండాకు చెందిన వాంకుడోత్ శ్రీకాంత్, కళ్యాణి దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవితం సాగిస్తున్నారు. వారికి ఆర్యన్ అనే 18 నెలల బాలుడు ఉన్నాడు. ట్రాక్టర్‌ను ఇంట్లో పెడుతుండగా అక్కడే ఆడుకుంటున్న ఆర్యన్‌కు.. ట్రాక్టర్ వెనుకభాగం తగిలింది. దీంతో తీవ్రంగా గాయాలవడంతో.. అతడిని ఇల్లెందు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఏడాదిన్నరకే కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
టేకులపల్లిలో ఏపీ వ్యక్తి ఆకస్మిక మృతి..
టేకులపల్లి మండలం బొమ్మనపల్లి పంచాయతీ పరిధి కారుకొండ క్రాస్‌రోడ్డు వద్ద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఖమ్మంపాడుకు చెందిన బండి రామకృష్ణ (50) కారుకొండ క్రాస్ రోడ్డు వద్దనున్న జమాయిల్ యార్డు వద్దకు వచ్చారు. అక్కడ కొద్దిసేపు పడుకుని లేచిన తర్వాత తనకు ఊపిరి ఆడటం లేదని చుట్టుపక్కల ఉన్న వారితో చెప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతడిని పరీక్షించి.. అప్పటికే మరణించినట్లు తెలిపారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా చిరునామాను పోలీసులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అంధించారు. మృతదేహాన్ని కొత్తగూడెం దవాఖాన మార్చరీకి తరలించారు.