రామవరం, ఆగస్టు 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ కాలనీలో నివాసం ఉంటున్న రాజు ఇంట్లో తను పెంచుకుంటున్న కోళ్ల బోనులోకి 11 అడుగుల కొండచిలువ దూరి పెద్ద కోడిపుంజును మింగేసి చుట్టుకుని పడుకుంది. యజమాని రాజు ఉదయం కోళ్లను విప్పాలని చూసేసరికి కొండచిలువ ఉండగా భయాందోళనకు గురయ్యాడు. వెంటనే ప్రాణాదార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ సభ్యులు మహేశ్, దత్తుకు చెప్పడంతో వెంటనే వారు వెళ్లి చాకచక్యంగా కొండచిలువను బంధించారు.
అనంతరం దానిని దట్టమైన అడవిలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రాణధార ట్రస్ట్ అధ్యక్షుడు సంతోశ్ మాట్లాడుతూ కొండ చిలువలు అంతరించిపోతున్న వన్య ప్రాణుల జాబితాలో ఉన్నట్లు తెలిపారు. అవి విష రహిత సర్పాలని, మనుషులకు హాని చేయవని, అవి కనిపిస్తే చంపకుండా గమనిస్తూ సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.