
బాలపేట – జన్నారం వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.20 లక్షలు
పల్లె ప్రకృతివనం ప్రారంభంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
తల్లాడ, జూలై 1: పల్లె ప్రగతి పనుల్లో ప్రజలందరూ భాగస్వాములై గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. 4వ విడుత పల్లెప్రగతి పనుల్లో భాగంగా గురువారం డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి బాలపేటలో పల్లెప్రకృతివనాన్ని ప్రారంభించారు. తొలుత అందులో మొక్కను నాటారు. అనంతరం ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలపేట – జన్నారం వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీగోడ నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరవుతాయన్నారు. పల్లెప్రగతి పథకం ద్వారా పది రోజుల పాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. గ్రామసభల్లో సమస్యలను గుర్తించి ఈ పది రోజుల్లో సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే విధంగా కృషిచేయాలన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత ఎంపవర్మెంట్ పథకం కింద రూ.1200 కోట్లు కేటాయించిందని వివరించారు. పల్లెప్రకృతివనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన సర్పంచ్ కోసూరి వెంకటనరసింహారావును ఎమ్మెల్యే అభినందించారు. ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఎంపీవో కొండపల్లి శ్రీదేవి, పీఆర్ ఏఈ అశోక్, ఎస్సై నరేశ్, ట్రాన్స్‌కో ఏడీఈ ఖాదర్, తల్లాడ సొసైటీ చైర్మన్ రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దుగ్గిదేవర వెంకట్‌లాల్, వైరా ఏఎంసీ వైస్‌చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్‌లు నారపోగు వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ కిరణ్‌బాబు, ఓబుల సీతారామిరెడ్డి, బద్ధం కోటిరెడ్డి, మువ్వా మురళి, వజ్రాల రామిరెడ్డి పాల్గొన్నారు.