భద్రాచలం, డిసెంబర్ 23: భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు (పగల్ పత్తు) శుక్రవారం వైభవంగా ప్రారంమయ్యాయి. తొలిరోజు భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు అంతరాలయంలో స్వామివారికి ఆరాధన, నివేదన తదితర నిత్య పూజలను నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారికి విశేష పాశురం విన్నవించారు. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలను ఉదయం 10:30 ‘తొళక్కం’తో ఆరంభించారు. దేవస్థానం ఈవో దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి అధ్యయనోత్సవాలు ప్రారంభించారు.
అనంతరం వేదశాస్త్ర, ఇతిహాస పురాణాదులకు దీక్షా వస్ర్తాలను ఈవో దంపతులు అందజేశారు. తరువాత అంతరాలయంలోని మూలమూర్తులకు మధ్యాహ్నిక ఆరాధన జరిపారు. బేడా మండపంలో ఉన్న ఉత్సవమూర్తులకు, పన్నిద్ధారాళ్వార్లకు, దేవస్థానం స్థానాచార్యులకు పరివట్టం కట్టి ఆలయ మర్యాదలు సమర్పించి శఠారితో పంచముద్రలు సమర్పించారు. అనంతరం ‘నాలాయిర దివ్య ప్రభందాన్ని’ పఠించారు. తరువాత ప్రాకార మండపంలో ఉన్న యాగవీర మూర్తులకు ‘మత్స్యావతారం’ అలంకరించి మహా నివేదన చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు స్వామివారిని ప్రత్యేక పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాలు, మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, కోలాట నృత్యాల నడుమ గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉంచారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
మత్స్యావతారంలో దర్శనమిచ్చిన రామయ్య భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 4 గంటలకు రాజవీధిలో ఉన్న విశ్రాంత మండపం వద్దకు స్వామివారిని తీసుకొని వచ్చి భక్తుల దర్శనార్థం ఉంచారు. 4:30 గంటలకు స్వామివారిని తాతగుడి సెంటర్ వద్దకు సకల రాజ లాంఛనాలతో తీసుకెళ్లారు. అనంతరం స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లి అంతరాలయంలోని మూలవరులకు సేవాకాలం జరిపారు. దేవస్థానం ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు, వేద పండితులు అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పర్ణశాలలో..
పర్ణశాల, డిసెంబర్ 23: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల రామాలయంలో కూడా శ్రీసీతారామచంద్రస్వామి మత్స్యావతారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.