– నల్లబండ బోడులో సర్వే ప్రక్రియ పరిశీలన
జూలూరుపాడు, అక్టోబర్ 08 : భూ రీ-సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జూలూరుపాడు మండలం నల్లబండ బోడు గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న భూ రీ-సర్వేను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ పరిధిలో మొత్తం 1,426 ఎకరాల భూమి ఉండగా సుమారు 12.50 కిలోమీటర్ల మేర సరిహద్దుల నిర్ధారణ సర్వే కొనసాగుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను వినియోగించి, పాత రికార్డులతో సరిపోల్చుతూ భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. సరిహద్దుల విషయంలో రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని సూచించారు. రీ-సర్వే తర్వాత రికార్డులు మరింత స్పష్టంగా ఉండి, భవిష్యత్తులో యాజమాన్య సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
గ్రామంలో పర్యటించిన కలెక్టర్ స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన రెండు ఎకరాల్లో పత్తి, మిర్చి సాగు చేస్తున్నానని రైతు భూక్యా పంతులు కలెక్టర్కు వివరించారు. కుమారులు పట్టించుకోవడం లేదని, వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేయగా కలెక్టర్ వెంటనే స్పందించారు. ఆ దరఖాస్తును తక్షణమే పరిశీలించి అర్హత మేరకు పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు తాసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరు రవి, సర్పంచ్ జి.సింధు, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.