భద్రాద్రి కొత్తగూడెం, మే 10 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు భద్రాద్రి జిల్లా అధికార యంత్రాంగం పక్కాగా, పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎండలు మండిపోతున్నప్పటికీ అధికారులు వాయువేగంతో పనిచేస్తూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి, మూడు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వెళ్లాయి. దీంతో కలెక్టర్ ప్రియాంక నేతృత్వంలో అధికారులు సమాంతర వేగంతో పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్‌ను పూర్తి చేసేందుకు సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నందున వారు పూర్తిస్థాయిలో హాజరై తమ ఓటు వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారు. ఎస్పీ రోహిత్‌రాజు సైతం క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టుల ప్రభావం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. 169 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటి వద్ద భద్రతా బలగాలను మోహరింపజేస్తున్నారు.
పోలింగ్ శాతం పెంచేలా..
జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. 18 ఏళ్లు దాటిన వారు ఓటు హక్కు పొందాలని, దానిని వినియోగించుకోవాలని సూచిస్తూ జిల్లావ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండరెడ్ల గ్రామాలకూ వెళ్లి ఓటింగ్‌పై అవగాహన కల్పించారు. జిల్లావ్యాప్తంగా 1,105 పోలింగ్ కేంద్రాల్లో మహిళలకు 172, దివ్యాంగులకు 161, యువతకు 151 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరో 138 మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే హోం ఓటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు.
12నే కేంద్రాలకు సిబ్బంది..
ఈ నెల 13 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఈ నెల 12న సాయంత్రానికే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. 1,163 మంది పీవోలు, 1,163 మంది ఏపీవోలు, 2,326 మంది ఓపీవోలు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నారు. 2,250 మంది పోలీసులు కూడా ఎన్నికల విధులకు రెడీగా ఉన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏఆర్వోలు తమ వద్దకు చేరిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. 1,385 బ్యాలెట్ యూనిట్లు, 1,385 కంట్రోల్ యూనిట్లు, 1,551 వీవీ ప్యాలెట్లు ఆయా కేంద్రాలకు చేరుకున్నాయి.
ప్రచారాలపై ప్రత్యేక నిఘా..
ఒక వైపు ఎన్నికల ఏర్పాట్లు జరుగుతుండగానే.. మరో వైపు రాజకీయ నాయకుల ప్రచారాలపై ఎన్నికల పరిశీలకులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎన్నికల వ్యయాన్ని పరిశీలిస్తున్నారు. ‘ప్రచార వాహనాలను ఏ సమయానికి నిలిపివేస్తున్నారు? ప్రచారం ఏ సమయానికి ముగిస్తున్నారు?’ వంటి అంశాలను గమనిస్తున్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, జెండాలను వెంటనే తొలగిస్తున్నారు. పరిమితికి మించి జనాలను తరలించినా స్కాడ్ బృందాలు పరిశీలిస్తున్నాయి.
పోలింగ్ కేంద్రాల్లో పక్కాగా సౌకర్యాలు..
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సౌకర్యాలన్నీ అధికారులు ఏర్పాటు చేశారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక అన్ని పోలింగ్ కేంద్రాల్లోని వసతులు, సౌకర్యాలను పరిశీలించారు.
సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్..
జిల్లాలో ప్రశాంత ఎన్నికల కోసం పక్కాగా ఏర్పాట్లు చేశాం. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు తరలించాం. ఈవీఎంల కమిషనింగ్ పూర్తయింది. అన్ని విభాగాల సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మహిళలు పూర్తిస్థాయిలో ఓటును వినియోగించుకునేలా అవగాహన కల్పించాం. కానీ.. భద్రాద్రి జిల్లాలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. -డాక్టర్ ప్రియాంక, భద్రాద్రి కలెక్టర్