అశ్వారావుపేట, జనవరి 21: నిస్సహాయులైన ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడడానికి ఇద్దరు యువకులు పథకం పన్నారు. బాలికలు చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రమాదం నుంచి బయటపడిన ఘటన ఆదివారం అశ్వారావుపేట పట్టణంలో వెలుగు చూసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు భద్రాచలంలోని ఓ హాస్టల్లో ఉంటూ స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వీరు సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వెళ్లారు. శనివారం ఇద్దరూ తిరిగి భద్రాచలానికి బయల్దేరారు. ఇద్దరు బాలికల్లో ఒకరి బావ ఏపీలోని జీలుగుమిల్లి మండలంలో నివాసం ఉంటున్నాడు. అతనికి కాల్ చేసి బంధువైన బాలిక ఖర్చుల కోసం డబ్బు అడిగింది. జీలుగుమిల్లి సమీప పట్టణమైన అశ్వారావుపేటకు బాలిక బావ రమ్మన్నాడు. దీంతో ఇద్దరు బాలికలు అశ్వారావుపేటకు వచ్చారు. బాలిక తన బావకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం వరకు పట్టణంలోనే ఉండిపోయారు. ఇది గమనించిన ఒక ఆటోడ్రైవర్ మిత్రుడితో కలిసి బాలికల వద్దకు వచ్చాడు. ‘ఉదయం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఏదో సమస్యతో సతమతమవుతున్నట్లు గమనించాను. మీరు ఆకలిగా ఉండి ఉంటుంది.
మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో రాత్రి సేదితీరి పొద్దున్నే జీలుగుమిల్లిలోని బంధువు ఇంటికి వెళ్లిపోదురు.’ అంటూ బాలికలను నమ్మించాడు. ఆటోడ్రైవర్ మాటలు నమ్మి రాత్రి 10 గంటల ప్రాంతంలో బాలికలు ఆటో ఎక్కారు. ఆటోడ్రైవర్ అతడి మిత్రుడు కలిసి వాహనాన్ని ఖమ్మం రోడ్డులోని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లారు. వెంట తీసుకొచ్చిన అల్పాహారాన్ని బాలికలకు అందించారు. ఇక అప్పటి నుంచి ఆటోడ్రైవర్ అతని స్నేహితుడు అనుమానాస్పదంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అప్రమత్తమైన బాలికలు తమకు ఏదైనా హాని జరుగుతుందేమోనని గ్రహించారు. వెంటనే సమీపంలోని ఓ ఫ్యాక్టరీ గేటు వద్దకు పరుగులు పెట్టారు. అక్కడ సెక్యూరిటీ గార్డుకు విషయాన్ని వెల్లడించారు. సెక్యూరిటి వెంటనే 100కు డయల్ చేశాడు. తర్వాత కేకలు వేసి తోటి కార్మికులను పిలిచాడు. ఇదంతా గమనించిన ఆటోడ్రైవర్తోపాటు అతని స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికలను విచారించారు. బాలికల తల్లిదండ్రులను అశ్వారావుపేటకు పిలిపించి వారికి అప్పగించారు. బాలికలను అపహరించిన ఘటన ఈనోటా ఆ నోటా పడి ప్రస్తుతం అశ్వారావుపేట పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఎస్సై శివరామకృష్ణను ‘నమస్తే’ వివరణ కోరగా.. బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించామని, వారు ఎవరి పైనా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆటోడ్రైవర్ వివరాలు సేకరిస్తున్నామని సమాధానమిచ్చారు.