రఘునాథపాలెం, నవంబర్ 21 : సరికొత్త ఫీచర్లతో వివిధ రకాల మోడల్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. అదరహో అనిపించే విధంగా విభిన్న మోడళ్లతో కస్టమర్లను కనువిందు చేయనున్నాయి. అయితే నూతన వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? టెస్ట్ డ్రైవ్ చేసి మరీ మీకు నచ్చిన వాహనాన్ని కొనాలనుకుంటున్నారా..? ఏ కంపెనీ వాహనం కొనుగోలు చేయాల్నో తెలియక షోరూమ్లన్నీ తిరిగి గందరగోళానికి గురవుతున్నారా..? అయితే ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో నిర్వహించే ఆటో ఎక్స్పో కార్యక్రమానికి తప్పక చేరుకోవాల్సిందే. కారు, బైక్ కొనుక్కోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం శని, ఆదివారాల్లో ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో ‘ఆటో షో’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. మీ అభిరుచులకు అనుగుణంగా అన్ని కంపెనీల ఆటో కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నూతన మోడల్ వాహనాలను అందుబాటులో ఉంచనున్నది.
ఆటో షో పేరుతో వాహన కంపెనీలను ఒక వేదికపైకి తీసుకురావడమే కాదు.. ప్రత్యేక రాయితీ సౌకర్యాన్ని సైతం కల్పించనున్నది. కంపెనీలు పలు వాహనాలపై పెద్ద మొత్తంగా రాయితీ సదుపాయాన్ని కల్పించనున్నాయి. ఇక్కడ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తారు. కొన్ని మోడల్ కార్లు, ద్విచక్ర వాహనాలను తగ్గింపు ధరలకు ఇవ్వనున్నారు.
ఆటో షోలో పలు కంపెనీలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఈ వేదికగా లభించనున్నది. ఆటో షోలో టెస్ట్ రైడ్ చేసి వాహనాలను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించనున్నాయి. దీనికి తోడు వాహనాలకు రుణ సౌకర్యం కల్పించేందుకు పలు బ్యాంకులను సైతం ఆటో షోలో భాగస్వాములను చేయనున్నది. షోకు వచ్చే సందర్శకులకు ప్రత్యేక గిఫ్ట్లు అందించాలనే ఉద్దేశంతో కూపన్లను సైతం అందించనున్నారు. లక్కీడిప్ ద్వారా కూపన్లను తీసి విజేతలకు బహుమతులు అందజేస్తారు.