కూసుమంచి(నేలకొండపల్లి), ఆగస్టు 21 : ఎంతో చరిత్రను తన చుట్టూ నిక్షిప్తం చేసుకున్న నేలకొండపల్లి ప్రాంతం తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఉండడం ఎంతో గర్వంగా ఉందని, దీనిని పర్యాటక కేంద్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
నేలకొండపల్లిలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియంను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. తొలుత భద్రాచలం రామాలయ పూజారులు, స్థానిక పూజారులు కలిసి మంత్రి, ఎంపీకి వేదాశీర్వచనం చేసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రపంచంలోనే పెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటిగా ఉన్న ప్రదేశం, రాముడి గుడి కట్టిన మహానీయుడు భక్తరామదాసు నడయాడిన స్థలం నేలకొండపల్లి అని, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామన్నారు.
కంచర్ల గోపన్నకు సంబంధించిన అనేక అంశాలను కళ్లకు కట్టినట్లుగా ఫొటోల ద్వారా తెలిపే విధంగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్‌బాబు, ఆర్డీలో గణేశ్, ఏసీపీ తిరుపతిరెడ్డి, నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, తుళ్లూరి బ్రహ్మయ్య, కంచర్ల చంద్రశేఖర్, శాఖమూరి రమేశ్, వెన్నెపూసల సీతారాములు, నెల్లూరి భద్రయ్య, తమ్మినేని నవీన్, మాజీ ఎంపీపీ వజ్జా రమ్య, రాయపుడి నవీన్, మామిడి వెంకన్న పాల్గొన్నారు.